==========
ఏ ప్రాణిని హింసించినా భగవంతుణ్ణి హింసించినట్లే
==========
‘జాతస్యహిదృవోమృత్యుః ధృవం జన్మమృతస్యచ’ అన్న భగవద్గీత వాక్యానుసారం జననమరణాల చక్రంలో మనం తిరుగాడుచున్నాము. ఈ వలయం నుండి మనం తప్పుకోవాలంటే మార్గం భక్తి. భగవంతుని ప్రార్థన వలన కలిగేది ముక్తి. ‘్భక్తి’ అంటే రాగాత్మకమైన మనసును పరమాత్మ చింతనవైపు మళ్ళించడమే. మనం స్థిరత్వం లేని మనసులో పుట్టి రాగద్వేషాల నుండి విముక్తి పొందలేము కనుక స్థిర బుద్ధి అత్యంతావశ్యకం. మానవునిలోని ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు కలిసినప్పుడే ఏపనైనా అవుతుంది. భక్తి సాధనలో ఇచ్ఛాశక్తి సమీకరణ జరగాలి. భగవంతుని చేరుకోవడానికి భక్తి యోగము సులభతరమైన మార్గము మొక్కటే. భక్తి యోగమంటే జీవునికి దేవునికి అనుసంధానంగా ఉపయోగపడే వారధి. భక్తి సాధనలో అర్చన, ధాన్యం అనే సాధనాలు మనకు తోడ్పడుతాయి. అందుకు మనం పరమాత్మ చింతన తప్ప, అన్యభావం లేకుండా నిలకడతో ఏకాగ్ర చిత్తంతో భగవంతుని ఆరాధన చేయాలి.
‘్భక్తి’లో రెండు రకాలు ఒకటి పరాభక్తి, మరొకటి అపరభక్తి. పరాభక్తి అంటే ఈశ్వరునిపై స్థిరమైన భక్తి. అపరభక్తి అంటే ప్రయత్నపూర్వకంగా చేసేది. పరతత్వచింతన చేయడానికి భక్తి, పూజలు, వ్రతాలు చేయడాన్ని గౌణభక్తి అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ భక్తి సాధనలో పంచదశలుంటాయి. మనకు ఆపదలు సంభవించినప్పుడే భగవత్ ఆరాధన భక్తి తర్వాత ఆపదలు తొలగిన వెంటనే భక్తి మార్గాన్ని మరచిపోతాడు. భగవంతుని అస్తిత్వంలో విశ్వాసం లేనప్పుడు ప్రార్థనపనిచేయదు. ప్రార్థనకు హృదయ శుద్ధి అవసరం. దృఢమైన విశ్వాసంతో హృదయ శుద్ధితో చేసే ప్రార్థనలే భగవంతుని చేరుతాయి. భగవప్ప్రార్ధన భక్తుని భగవంతుని సన్నిధిని చేరేందుకు అనంత ఫలాలనిచ్చే సులభమైన సాధనం. అసలు ప్రార్థన అంటే నిర్మల హృదయంతో, విశ్వాసముతో, వినయంతో, భగవంతునితో సంభాషించడం.
భగవంతుని దృష్టి మనపై ప్రసరించినప్పుడు మనకు సంభవించే కష్టాలు దూరమవుతాయి. సర్వ సమర్థుడైన భగవంతుడు అన్నింటికి కర్త. అందుకే మనకు దైవాన్ని ప్రార్థించడం కంటే మించిన మరో సాధనము లేదు. భక్తితో తనను ప్రార్థించిన వారిని నిత్యం కాపాడే ఆర్తరక్షకుడు. అందుకు మనం భక్తి శ్రద్ధలతో నిర్మిలమైన మనస్సుతో నిరంతర భగవంతుని ఆరాధించి స్మరిస్తే మన ప్రార్థనను మన్మించి, మన మనోవాంఛలను మన్నిస్తాడు. నిర్మల హృదయ ప్రార్థనకు అనంతమైన శక్తి కలిగి, సకల సమస్యలను ఛేదించగల శక్తి సామర్థ్యాలున్నాయి. ప్రార్థనలోగల అమోఘమైన శక్తివలన సమస్త దుఃఖాలను పోగొడుతుంది. ప్రార్థన ఎలా చేసినప్పటికీ ఫలితంలో మార్పుండదు. మన ప్రార్థన సత్యమైనప్పుడు లక్ష్యాన్ని చేరుకోగలం. భగవంతుని ముందు మోకరిల్లి రక్షించమని ప్రార్థించినప్పుడు ఫలితం కనబడుతుంది. భగవంతుడు ధర్మ పక్షపాతి. భగవంతుడు సర్వశక్తి సమన్వితుడు. ఆయన మనందరిలోన ప్రవహిస్తున్న నిరంతర చైతన్య ప్రవాహం. పరమాత్మకంటే శ్రేష్ఠమైనదేదీ ఈ భూమీద లేదు. సదా మన కోర్కెలను తీర్చేవాడు. సుఖమూ, దుఃఖమూ భగవంతుడే.
‘నస్ర్తినపమన్’ అని శాస్త్రోక్తి. అంటే భగవంతుడనేవాడు స్ర్తి రూపములోనూ ఉండడు. పురుష రూపంలోనూ ఉండడు. అన్నివిధాలైన రూపాలలో గోచరించేవాడు. సర్వప్రాణులలో వసించేవాడు. అట్టి భగవంతునిపై భక్తి అనితరమైనది. అనంతమైనది.


