ప్రారబ్దం

  • PDF
  • Print
  • E-mail

‘‘ఇది నా ప్రారబ్దం’’ అంటూ ఆపద సమయాల్లో మనం వాపోవడం సర్వసాధారణం. ఎవరు చేసుకున్న కర్మ వారనుభవించవలసిందే. ‘అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభ’ అన్నట్లు ఎటువంటి వ్యక్తికైనా కర్మానుభవం తప్పదు. కర్మంటే కార్యఫలం. చేసిన కార్యంవల్ల లభించే ఫలమే ప్రారబ్ద కర్మ. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు. మన పురాణాల్లోకెళితే ఎన్నో దృష్టాంతాలు కళ్ళముందు సాక్షాత్కరిస్తాయి. సత్యహరిశ్చంద్రుడు వంటి మహానుభావుడే ఆలుబిడ్డలతో అడవుల్లో ఎన్నో కష్టాలనుభవించాడు. నలమహారాజైతే రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యాబిడ్డల్ని విడిచి అడవులపాలయ్యాడు. చివరికి బాహుకుడై ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇక ధర్మరాజు విషయానికొస్తే అతడు రాజ్యభ్రష్టుడై అన్నదమ్ములతో వనవాసం చేసి ఎన్నో కష్టాలనుభవించాడు. అటువంటి మహనీయులకే కర్మానుభవం తప్పనప్పుడు మనమనగా ఎంత?


ప్రారబ్దం మూడు రకాలు. అవి ఇచ్ఛాప్రారబ్దం, పరేచ్ఛా ప్రారబ్దం, అనిచ్ఛా ప్రారబ్దం. ఏ పని చేయడంవల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందో ముందుగానే ఊహించి వివేకంతో ఆ పనిచేసి దాని ఫలితాన్ని అనుభవించడం ఇచ్ఛా ప్రారబ్దం. విధివశాన్న సంభవించే కర్మఫలితం అనిచ్ఛా ప్రారబ్దం. తనకు ఇష్టం లేకున్నా ఇతరుల ప్రోద్బలంతో చేసే పనివల్ల కలిగే ఫలితాన్ని అనుభవించడం పరేచ్ఛా ప్రారబ్దం.
ఈ జన్మలో చేసుకున్న పాపం మరుజన్మలో అనుభవింపక తప్పదన్నది కర్మసిద్ధాంతం. అయితే ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వారు ఉన్నారు. బ్రతికుండగా కార్యఫలాన్ని అనుభవించడం సంభవమైతే అవొచ్చు. ఈ జన్మలో చేసుకున్నది మరు జన్మలో అనుభవించడం అసంభవమన్నది వీరి ఉవాచ. ఇటువంటి వితండవాదన చెయ్యడంవల్ల ప్రయోజనం ఉండదు. కర్మలేకపోతే పుట్టుకే లేదు. ఎవరు చేసిన కర్మవారనుభవింపక తప్పదని శ్రీకృష్ణపరమాత్ముడు ఏనాడో గీతలో వక్కాణించాడు.


ప్రారబ్ద కర్మఫలాన్ని అనుభవించడం కష్టంగానే ఉంటుంది. అయినా దాని నుండి తప్పించుకోలేం. లోకంలో ఎందరో శ్రీమంతులు, మరెందరో పేదవారు, ఇంకొందరు అంగవైకల్యంతో బాధపడేవారు. ఈ తేడాలన్నీ చేసుకున్న కర్మ ఫలితమే అన్న భావన ఉన్ననాడు చెడుపనులు చెయ్యడానికి ఆస్కారముండదు. ఫలితంగా సమాజం మూడు పువ్వులు, ఆరు కాయల్లా సుఖ సంతోషాలతో విలసిల్లుతుంది.
ఇచ్ఛా, అనిచ్ఛా, పరేచ్ఛా, ప్రారబ్దముల మూడింటిలో మొదటిదానిని తప్పించుకొనవచ్చునేమో గాని మిగిలిన రెండింటిని అనుభవింపక తప్పదు. వీటన్నిటికి మూలం మనసే కాబట్టి ముందుగా దానిని అదుపులో ఉంచుకుని సక్రమంగా నడిచే ప్రయత్నం చెయ్యాలి. మనసును అదుపులో పెట్టుకోడం కష్టమైనా సాధనతో తప్పకుండా సాధ్యవౌతుంది. అందులో అణుమాత్రం సందేహం లేదు.


మనసును అదుపులో పెట్టుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయ. కాని అన్నింటిలోకి సులువైన మార్గం మాత్రం అన్నింటికీ భగవంతుడున్నాడని భావించడం. పాపభీతిని కలిగుండడం. మరొకటి ఏది జరిగినా మనమంచికే అని అనుకోవడం. నేను నిమిత్తమాత్రుడను. చేసేది, చేయంచేది భగవంతుడే అనే జ్ఞానం కలిగుండడం. ఇలా అనుకొన్నందువల్ల చెడుపనులకు దూరంగా ఉండడానికి అస్కారం ఉంటుంది. ఇతర ప్రాణులపట్ల జాలి దయ అనే గుణాలు ఏర్పడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆలోచనాధోరణి తో మనసు పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడ పరిశుభ్రం అంటే చెడు తలంపులకు దూరంగా ఉండటం. ఈ తలంపుల వల్ల మనసు పూర్తిగా అదుపులో ఉంటుంది.