మానవాళిని ఆకర్షించిన ఒకే ఒక గుణము శ్రీరామచంద్రుని ధర్మం. ‘‘రామో విగ్రహవాన్ ధర్మః’’ మూర్త్భీవించిన ధర్మమే శ్రీరాముడు. ఆ పరమాత్మనామాలలో ‘‘రామా’’ శబ్దం అత్యంత ప్రాముఖ్యం గలది. భవసాగర తరణానికి తారకం ‘రామ’ శబ్దమని జ్ఞానుల నమ్మిక. ‘వేయి విష్ణు నామాలను పఠించే అవకాశం లేనప్పుడు ‘రామ, నామమొకటి స్మరించినా చాలును’ అంటారు శ్రీ ఆదిశంకరులు. శ్రీరామచంద్రమూర్తి భక్త జనరక్షకుడు. భక్తులపట్ల ఆయనకు అమితమైన ప్రేమానురాగాలు. తనపాద స్పర్శతో రాతిని నాతిగా చేసిన కరుణామయుడు. అంతేకాదు తన కోసం సర్వం త్యజించి తనే్న నమ్ముకున్న భక్తురాలు శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను స్వీకరించిన భక్తజన ప్రియుడు. సర్వప్రాణులపట్ల అపారమైన కరుణ కలిగిన జగద్క్ష్రకుడు. అందుకనే చెరసాలలో కడగండ్లు పాలవుతున్న రామదాసుని స్వయంగా వెళ్ళి విడిపించిన భక్తజన ప్రియుడు. ‘‘రామనామము రమ్యమైనదని, భక్తులు స్తుతిస్తే, ‘శ్రీరామ నీనామమెంత రుచిరా’ అంటూ రామనామంతోనే తరిస్తారు రాముని నమ్మిన భక్తులు. ప్రపంచంలో రామనామానికి ఏ నామము సాటిరాదనే భక్తి తత్పరతతో జపిస్తారు. శ్రీరామనామంలానే శ్రీరామాయణం కూడా ఎంతో మహిమాన్వితం అయింది. ఎవరినోట రామాయణం పలకబడుతుందో, ఎవరి చెవిలో రామాయణం కథ మ్రోగుతుందో వారికన్నా ధన్యులు ఈ ముల్లోకాలలోను లేరని ప్రతీతి.
శ్రీరామాయణమున శ్రీరాముని జీవితం సంఘటనాత్మకమైనది. స్వార్థాన్ని త్యజించి, ధర్మమార్గాన్ని ఆచరిస్తూ విశిష్ట మానవుడుగా వెలుగొందుతాడు. దశరథరాముడు కల్యాణ రాముడిగా, సీతారాముడిగా, కోదండ రాముడిగా, మారుతి రాముడిగా, ఆత్మ రాముడిగా, అమృత రాముడై అనంత రాముడిగా పరిఢివిల్లాడు. శ్రీరాముడు సత్యసంధుడిగా, శ్రేయోభిలాషియైన మిత్రుడుగా, ఆదర్శ సోదరుడుగా, ప్రేమైక మూర్తియైన భర్తగా, కరుణాసింధుడిగా, ధర్మస్వరూపుడుగా, శరణాగత వత్సలుడుగా, పురుషోత్తమునిగా, అదృశ్యముగా, సర్వాంతర్యామియై సమస్త ప్రకృతిచే కీర్తింపబడు పరమాత్మగా దర్శనమిచ్చే శ్రీరాముని నామానికి అంత మహిమతో ప్రకాశిస్తుంది.
ఆనాటి రామరాజ్యాన్ని మానవాళి హృదయాలలో నిక్షిప్తమై వుందనడానికి రాజ్యపాలకుడుగా శ్రీరామచంద్రమూర్తి జగత్తుకే మార్గదర్శకం. ‘రామ, అన్నపదం రెండు అత్యున్నత బీజాక్షర యుక్తమైన మంత్రం. ‘రా’ అనే అక్షరం పలుకగానే మానవ సమస్త దోషాలు తొలగిపోయి కల్మషరాహిత్యాన్ని మానవునికి ప్రసాదిస్తుంది. ‘మ’ అనే రెండో బీజాక్షరం మానవుల హృదయాంతరాలు అమృతమయమై దైవత్వాన్ని ప్రసాదిస్తుంది. రామనామం రెండు అత్యున్నత బీజాక్షరాల సంహిత. మధురాతి మధురమైన సుశబ్దం. ఆదో ప్రణవనాదం. ఆదో వేదం. ఒక పరిపూర్ణ జీవితానికి నిర్వచనం శ్రీరామచరిత్ర. సాక్షాత్ శ్రీమన్నారాయుడే నరుడిగా అవతారమెత్తి విశ్వమానవ జాతికి ఆదర్శమూర్తిగా నిలిచాడు. రాముడు మానవరూపంలో ఉన్న మాధవుడిని ఆంజనేయుడు కీర్తించాడు. శ్రీరాముడు నాకు ప్రేమాతిశయగల భర్తే కాకుండా సకల లోకాలకు స్వామి, ఆఖిలలోకారాధ్యుడు, వేదవేద్యుడు, నిర్మలగుణ యశోనిధి, సర్వజీవులకు సముడు, పరంధాముడైన శ్రీరామచంద్రుడు పగతుని పరిమార్చి తనను పరిగ్రహిస్తాడని జగన్మాత జానకి విశ్వాసం. ధనుర్ధారి అయిన శ్రీరామచంద్రమూర్తికి అపజయం అనేది లేదని విశ్వసించిన దేవతలు కూడా రాముని స్మరించారు. శుభం కలగాలని దీవించారు. రామనామాన్ని భజించి, ప్రార్థించే మానవాళి జగమంతా రామమయమై జీవన్ముకులు అవుతారు.


