గానగంధర్వుడు హనుమంతుడు

  • PDF
  • Print
  • E-mail

హనుమంతుడు విద్వాంసుడు. సంగీత శాస్తవ్రేత్త. నవవ్యాకరణ పండితుడు. సూర్యుని ఆశ్రయించి సకల శాస్త్రాలు, వేదవేదాంగములు ఔపోసన పట్టాడు. మహా జ్ఞాని.

పంపాతీరమున సీతకై వెతుకుతున్న రామలక్ష్మణులను చూచిన సుగ్రీవుడు భయకంపితుడై హనుమను పిలిచి వారెవరినో తనను చంపమని తన అన్న వాలి పంపించాడని బెదరి పలికాడు. హనుమంతుడు తన రాజైన సుగ్రీవుని శాంతపరచి తాను వారెవరైనది తెలుసుకుని వస్తానని బయలుదేరి వెళ్లాడు.

రాముడు హనుమంతుడు మాట్ల్లాడిన తీరుకు సంతసించి లక్ష్మణునితో ‘‘ఈతడు వేదాధ్యయనం చేసినట్లు ఈతని మాటలవలన తెలుస్తోంది. ఈతని నోటి వెంబడి ఒక్క పరుష వాక్యం కానరావడం లేదు. ఈతని ఆకృతిలో, సంభాషణలో ఇసుమంతు దోషము లేదు. స్పష్టమైన పదాలతో, అర్థవంతమైన సంస్కృత భాషలో కడు మనోహరముగా మాట్లాడుతున్నాడు’’ అని శ్రీరాముని మెప్పు పొందిన హనుమంతుడు సకలవిద్యాపారంగతుడు. ఈతడు ‘శ్రీరామ చరితము’ అను కావ్యమును రచించినట్లు చెబుతారు. ఈతడు కవియేగాక సంగీత విద్వాంసుడు కూడా. అంతేకాదు హనుమంతుడు ఏడుగురు చిరంజీవులలో ఒకడు. సుదర్శన, సత్యభామలకు నా అంతటివారు లేరన్న గర్వం కలిగినప్పుడు హనుమంతునిచే వారి గర్వభంగం చేయించాడు శ్రీకృష్ణుడు.

సముద్రంపై వారధి కడుతున్నప్పుడు హనుమంతుడు శిలలపై ‘రామనామం’ వ్రాసి సముద్రంలో వేసినప్పుడు ఆ శిలలు తేలినట్టు చెబుతారు. రాముడు కూడా ఒక శిలను ‘నేను వేస్తున్నప్పుడు రామనామం’ ఎందుకని రాయకుండా వెయ్యగా అది మునిగిపోయిందట. అంటే భగవంతుడుకంటే నామమే గొప్పదని ఈ కథను ఉదహరిస్తారు.

నారద, తుంబరులు దేవ ఋషులు. సంగీతంలో ఒకరిని మించినవారు మరొకరు. నారద, తుంబరులిద్దరు సంగీతంలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకొన్నారు. వారిరువురు శ్రీకృష్ణ పరమాత్ముని దగ్గరకు వెళ్ళి వారి సమస్యను పరిష్కరించమని అర్థించారు. అతడు చిరునవ్వు నవ్వి మీ తగవు తీర్చగల సమర్థుడు హనుమంతుడు. అతడి దగ్గరకు వెళ్ళమని చెప్పాడు. వారిరువురు హనుమంతుని వద్దకు వెళ్ళారు. శ్రీకృష్ణుని అభిమతం గ్రహించిన హనుమంతుడు మందహాసం చేశాడు. వారినొక శిలపై కూర్చుండబెడ్డి హనుమంతుడు తన దివ్యగానం ఆలపించాడు. అతని గాన ప్రభావానికి శిలావేదిక కరిగి వారిరువురు దానిలో కూరుకుపోయారు. కొంతసేపటికి అది శిలగా మారింది.

అంత హనుమంతుడు వారితో ‘‘మీరు గాంధర్వ గానం ఆలిపించి కరుడుకట్టిన ఆ శిలను కరిగించి మీరు బయటకు రండని’’ చెప్పాడు. వారిరువురూ వారి శక్తి కొలది గానమాలపించినా ఫలితం లేకపోయింది. ఆ శిల కరగలేదు. చివరకు వారు హనుమంతుణ్ణి రక్షించమని శరణు వేడారు. అప్పుడు హనుమంతుడు తన గంధర్వ గానంతో ఆ శిలను కరిగించాడు. వారు బయటకు రాగలిగారు. హనుమగాన కౌశలానికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీకృష్ణుడు తమ అహంభావానికి తగిన గుణపాఠం నేర్పడానికి హనుమంతుని దగ్గరకు పంపించినట్టు తెలుసుకొని సిగ్గుతో తలలు వాల్చుకొన్నారు.


రామాయణంలో హనుమంతుడు చేసిన అద్భుత కార్యములను ఎవరైనా మెచ్చుకున్నప్పుడు అదంతా సీతారాముల కరుణ కటాక్షములని సవినియంగా చెప్పుకునేవాడు హనుమంతుడు. అంతటి నిగర్వి. ఎప్పుడూ రవ్వంత గర్వమైనా మనసులోకి రానివ్వనివాడు. ప్రదర్శించనివాడు. ఎప్పుడూ తాను రామదూతననే చెప్పుకున్నాడు. త్రేతాయుగం నుండి కలియుగం వరకు తిరుగులేని దైవంగా ప్రజల పూజలందుకుంటున్న ఏకైక దైవం ఆంజనేయస్వామి. తులసీదాస్ ‘రామచరిత మానస చరిత్ర’ వ్రాసినప్పుడు రామలక్ష్మణుల దర్శన భాగ్యం కలుగజేయమని హనుమంతుని వేడుకున్నాడు. అలాగే వారి కోరిక నెరవేర్చాడు. ఎక్కడెక్కడ రామాయణ ప్రసంగాలు జరుగుతూ ఉంటాయో అక్కడ స్వామి హనుమంతుడు అదృశ్యంగా ఉంటూ రామనామానికి ఉప్పొంగి పోతూ ఉంటాడు.