తల్లి ఋణం తీర్చుకోలేం

  • PDF
  • Print
  • E-mail
తల్లే అందరికీ మొట్టమొదటి దైవం. లోకం అనే ఈ గుడిని చేరుకోవడానికి మాతృదేవతే తొలిమెట్టు. చిన్నప్పుడు అమ్మ ఒడే పసిపాపకు దేవాలయం. ఎవరి ఋణమైనా ఏదో విధంగా తీర్చుకోవచ్చు. కానీ నవమాసాలు మనని గర్భంలో మోసి, అసహ్యపడకుండా మలమూత్రాదులు ఎత్తి, మన అభివృద్ధే ఎప్పుడూ కోరుకునే ‘అమ్మ’ ఋణం తీర్చుకోగలగడం ఎవ్వరికీ పూర్తిగా సాధ్యం కాదు.

శంకరుల వంటి పరమ సన్యాసి కూడా ‘‘కుపుత్రో జాయేత్ క్వచిదపి కుమాతా న భవతి’’ అని మాతృదేవతను ప్రశంసించారు. దుర్మార్గుడైన కుమారుడు ఉండుగాక, చెడ్డతల్లి మాత్రం ఎక్కడా ఉండదన్నారు.వేదం కూడా అమ్మకు మొట్టమొదటి స్థానం ఇచ్చి ‘మాతృదేవోభవ’ అని ప్రశంసించింది. ‘‘భార్య మాట విని కన్నతల్లిని కొట్టడానికి వచ్చిన కుమారుడు జారిపడిపోతే తండ్రీ! ఆ దెబ్బ నాకైనా తగిలింది కాదేమిరా?’’ అని ఏడ్చిన తల్లి కన్నీటికి విలువ కట్టగల వారున్నారా ఈ లోకంలో. తాను తినడానికి లేకపోయినా కన్నకొడుకు కడుపు తడిమి భోజనం పెట్టే అమ్మ ప్రేమకు మించిన అమూల్యమైన వస్తువు ఈ పృథివిలో లేనేలేదు. అందుకే ‘హితప్రదాయిని’ ఇలా అంటోంది...
భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రా యుతేన చ
సేతు స్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే

ఆరుసార్లు భూమికి ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యమో, పదివేల సార్లు కాశీ వెళ్లి ఎంతఫలమో, వందలసార్లు రామేశ్వరంలో సేతుదర్శనం చేసి స్నానిస్తే ఎంత ధన్యత కలుగుతుందో... ఆ ఫలమంతా కలిపి ఒక్కసారి తల్లికి నమస్కారం చేస్తే కలుగుతుందిట. అమ్మ అంటే నడుస్తున్న దైవం. ఆమెను అందరికీ సేవలు చేసే పనిమనిషిలా చూస్తారే తప్ప సంతానం ఆమెలో దైవాన్ని చూసే ప్రయత్నం చెయ్యరు. భూమి మీద అనేక దేవాలయాలు, పుణ్యక్షేత్రాలూ, తీర్థాలూ, తపస్వులూ, సాధుజనులూ ఉన్నారు. ఒక్కసారి ఈ భూమిని చుట్టి వస్తే వారందరికీ నమస్కరించి ప్రదక్షిణం చేసినట్లు అవుతుంది. అటువంటిది ఆరుసార్లు భూప్రదక్షిణం అంటే అనంతమైన పుణ్యం సిద్ధిస్తుంది. అదంతా తల్లికి నమస్కరిస్తే చేసే చిన్నపనితో లభిస్తుంది. ఆ ధర్మ సూక్ష్మాలన్నిటినీ గ్రహించిన గణపతి... తల్లిదండ్రులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి గణాధిపత్యాన్ని పొందాడు.

ఒక్కసారి కాశీయాత్ర చేస్తేనే చాలు, అన్ని పాపాలూ పోయి అక్షయమైన పుణ్యం కలుగుతుంది అన్నది యథార్థం. అటువంటిది అమ్మకు చేసే నమస్కారం పదివేల సార్లు కాశీయాత్రఫలం కలిగిస్తుంది అంటే ఎంత నమ్మశక్యం కాని మహాఫలం అది.

ఒక్కసారి రామేశ్వరంలో సేతుదర్శనం చేసి స్నానం చేస్తే బ్రహ్మహత్యాది పాపాలు కూడా నశిస్తాయి. అటువంటిది వందల స్నానాలు మాతృవందనంతో సమానమంటే అమ్మకి ఈ సృష్టిలో సరితూగగల వస్తువు ఏదీ లేదు. అమ్మ... పనులు చేసే యంత్రం కాదు. భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్లిపోతే పిల్లల్ని ఆడించే పనిమనిషి అంతకన్నా కాదు. ‘ఆ లక్ష్మీదేవే, ఆ జగన్మాతే అమ్మగా అవతరించింది’ అని భావన చేయాలని శాస్త్రం చెబుతోంది. ప్రతిఒక్కరూ అమ్మకు నమస్కారం చేసి, ఆమె ఆశీస్సులు పొందాలి. ఆమెను వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాల్లో చేర్పించడమంటే దేవతను దూరం చేసుకున్నట్లే. ఆమె బాధతో ఒక్క కన్నీటి బొట్టు రాల్చినా అది ఎన్నడూ మంచిదికాదు. పెద్దతనంలో ఆమెను సేవించే మహాపుణ్యాన్ని దూరం చేసుకోకూడదు. ఏ కార్యం చక్కబడాలన్నా తల్లికి నమస్కరించి ఆమె దీవెన తీసుకున్నప్పుడే ఆ కార్యం నెరవేరుతుంది.