అందమైన చర్మం అందరికీ...కనువిందు

  • PDF
  • Print
  • E-mail
ద్రాక్షపళ్ల లాంటి కళ్ళు... ఆపిల్‌పండు వంటి చెక్కిళ్లు...
దొండపండు లాంటి పెదవులు... దానిమ్మగింజల్లాంటి చిగుళ్లు... తమలపాకుల్లాంటి చేతులు - ఈ పోలికలన్నీ ఊరికే పుట్టలేదు!
‘వి ఆర్ వాట్ వి ఈట్....’ అంటే... మనం తీసుకునే ఆహారమే మన అందాన్ని,
ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది! మన శరీరానికి రక్షణ కవచమైన చర్మం మన హెల్త్ స్టేటస్‌ని చెప్పకనే చెబుతుంది. దాని సంరక్షణకు, పోషణకు తీసుకోవలసిన విందు భోజనం లాంటి జాగ్రత్తలపై సంపూర్ణ కథనం ఈ వారం మీ కోసం...


తల్లి గర్భంలోనే చర్మం రంగు, దాని తత్వం నిర్దేశించబడుతుంది. పుట్టిన నాటి నుంచి మన శరీరంతో పాటు చర్మంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. పసిపాపగా ఉన్నప్పటి లేత చర్మం పెద్దవాళ్లయ్యేప్పటికి పూర్తిగా మారిపోతుంది. ఇది ప్రకృతి సహజంగా జరిగే మార్పే అయినా సరైన ఆహారం, చక్కటి జీవనశైలి ద్వారా వృద్ధాప్యపు జాడలని మన దరికి చేరనీయకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు. ముట్టుకుంటే గరుగ్గా... చూడటానికి కాంతిహీనంగా కనిపించే చర్మం సరైన పోషణ, సంరక్షణ లోపాన్ని ఎత్తి చూపుతుంది. అయితే అందంగా, ఆరోగ్యమైన చర్మం కోసం ఖరీదైన క్రీములు, ట్రీట్ మెంట్లు అవసరం అనుకుంటే మీరు పొరబడుతున్నట్టే! చర్మం, దాని పని తీరు వంటి అంశాలపై అవగాహనతో పాటు దానిని సంరక్షించుకోవటంలోని మెళకువలు తెలుసుకుంటే నిగనిగలాడే చర్మం ప్రతి ఒక్కరిసొంతం అవుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

మృతకణాల పొరలు....
మన శరీరంలో అతి పెద్ద అవయవం ‘చర్మం’. లోపలి భాగాలను కప్పిఉంచటమే కాదు ఒక కవచంలా మనల్ని అంటి పెట్టుకుని ఉంటుంది ఇది. పైకి కనిపించే చర్మం (ఎపిడెర్మిస్) పూర్తిగా 25-30 అతిసన్నటి పొరల మృతకణాలతో తయారై ఉంటుంది . ప్రతీ 28-30 రోజులకోసారి కొత్త కణాలను తయారుచేసుకుంటుంది మన శరీరం. అవి పైకి చొచ్చుకువచ్చినప్పుడు మృతకణాలు రాలి పడిపోతాయి. సగటున నిముషానికి 30,000-40,000 వరకూ మృతకణాలు మన శరీరం నుంచి రాలిపోతాయి. ప్రతి రోజూ మన ఇంటిలో పేరుకుపోయే దుమ్ములో అధికశాతం మృతకాణాల వల్లే అంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే మృతకణాలు పూర్తిగా తొలగించుకునే శక్తి చర్మానికి లేదు. ఈ పరిస్థితిలో మృతకణాలు గనక పేరుకుపోతే చర్మం గరుగ్గా మారుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా సున్నిపిండి లాంటి పదార్థాలతో స్క్రబ్బింగ్ చేసుకొని మృతకణాలను తొలగించేందుకు మనవంతు సహాయం చేయాలి.

మెలనిన్‌కి తోడు...
మన ఒంటి ఛాయను నిర్దేశించేది చర్మంలో ఉన్న మెలనిన్ శాతం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత నల్లగా ఉంటుంది శరీర ఛాయ. ఎండలో తిరిగినప్పుడు సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడటం కోసం శరీరం మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే ఎండలో తిరిగినప్పుడు సన్‌టాన్
(చర్మం నల్లబడటం) అవుతుంది. అయితే మెలనిన్ ఎంత శక్తివంతమైనా సూర్యుడి ప్రతాపం నుంచి పూర్తిసంరక్షణ మాత్రం మనకందించలేదు. అందుకే ఎండలో తిరిగినప్పుడు తప్పనిసరిగా సన్‌టాన్ లోషన్‌ని వాడటం అలాగే సరైన దుస్తులతో సంరక్షించుకోవటం చేయాలి. ఇలా చేయటం వల్ల స్కిన్ క్యాన్సర్ బారి నుంచి కూడా మనల్ని సంరక్షించుకోవచ్చు.

మృతకణాల కింద జీవం...
ఎపిడెర్మిస్ కింద ఉండే పొరని డెర్మిస్ అంటారు. ఇది మన చర్మానికి జీవాన్నిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఉండే నరాల చివర్లు, రక్తనాళాలు, నూనె, శ్వేత గ్రంధులు స్పర్శని కల్పించటంతోపాటు చర్మం ఊపిరి పీల్చుకోవటానికి సహాయపడతాయి. అయితే వీటితోపాటు కొలాజెన్, ఎలాస్టిన్, కెరటిన్ అనే అతి ముఖ్యమైనవి కూడా డెర్మిస్ పొరలో ఉంటాయి. పీచులాగా సాగే గుణం ఉన్న మాంసకృత్తులు ఇవి. మన శరీర పటుత్వం, ఆరోగ్యం, వంచ గలిగే శక్తిని ఎలాస్టిన్ నిర్దేశిస్తే, కొలాజన్ వృద్ధాప్యపు జాడలతో పోరాటం చేస్తుంది. కెరటిన్ శరీర దారుఢ్యాన్ని పెంచి హుషారుగా ఉంచుతుంది .

కొలాజెన్....అమృతంతో సమానం!
కొలాజెన్ మన చర్మాన్ని శరీరంతో పట్టివుంచేలా దోహదపడుతుంది.కెరటిన్‌తో కలిసి ఇది మన శరీరానికి ఎంతోమేలు చేస్తుంది. మన శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకి కొలాజెన్ ప్రమేయం ఉందని తెలిసిన దగ్గర నుంచి సైంటిస్టులు దీనిపై ప్రయోగాలు మరింత ముమ్మరం చేశారు. దీనిని గనక తయారు చేసుకోగలిగే శక్తి శరీరానికి ఉంటే అమృతం తాగిన దేవతల్లా నిత్యయవ్వనంతో ఉండిపోవచ్చు. వృద్ధాప్యపు ఛాయ కూడా మన పె పడదు. అయితే దురదృష్టవశాత్తు వయసు పైబడే కొద్దీ కొలాజెన్ తగ్గిపోవటం వలన చర్మం పలచగా తయారవ్వటమే కాదు పటుత్వం కోల్పోయి ముడతలు పడుతుంది. కృత్రిమంగా కొలాజెన్‌ను తయారు చేసి ఇంజెక్షన్ల రూపంలో శరీరంలోకి పంపించేవరకూ పరిశోధనలు వచ్చినా వాటి వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ మాట ఇంకా తెలియదు. కాని మనం తినే ఆహారం ద్వారా మన శరీరానికి అవసరమైనంత కొలాజెన్‌ను అందించవచ్చు అని డాక్టర్లు కచ్చితంగా చెపుతున్నారు. కొన్ని రకాల విటమిన్లు, యాంటిఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్...అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం ద్వారా దీన్ని సాధించవచ్చు అని వారు పరిశోధనల ద్వారా నిరూపించారు.

కొలాజెన్‌ను పెంపొందించే శక్తి కలవి...
యాంటిఆక్సిడెంట్స్ : కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకున్న తరవాత విసర్జించిన ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే హానిని రిపెయిర్ చేయటానికి ఉపయోగపడతాయి. ఇవి సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల కొలాజెన్ ఉతపత్తి పెంచవచ్చు.

అమినో యాసిడ్స్: కొలాజెన్ ఉత్పత్తికి సహకరించే వీటిని మన శరీరం 10-20 మాత్రమే తయారు చేసుకోగలుగుతుంది, మిగిలిన రకాలు మనం తినే ఆహారం ద్వారా శరీరానికి అందించాలి.

ఒమేగా యాసిడ్స్ : మన శరీరానికి ఎంతో ఉపయోగపడి, కొలాజెన్ ఉత్పత్తి పెరగటానికి తోడ్పడే వీటిని మన శరీరం తయారుచేసుకోలేదు. మనం తినే ఆహారం ద్వారానే వీటిని సమకూర్చాలి.
CoQ10 ఇది కొలాజెన్ ఉత్పత్తికి ఎంతో కీలకమైనది.

విటమిన్ ఇ,ఎ, సి : కొలాజెన్ ఉత్పత్తికి,మెయింటెన్ చేయటానికి సహాయపడే వీటిని తినే ఆహారం ద్వారా సులువుగా శరీరానికి అందించవచ్చు.

జింక్, సల్ఫర్ : పళ్లు,కాయగూరల్లో లభ్యమయ్యే ఈ ఖనిజాలు కొలాజెన్ ఉత్పత్తిని పెంచి సంరక్షిస్తాయి.

కొలాజెన్ లభ్యమైయ్యే ఆహార పదార్థాలు...
బిటాకెరటిన్: క్యారెట్స్, చిలగడదుంపలు, టమాటా, పుచ్చకాయ, బొప్పాయి, పాల కూర..

ఒమేగా యాసిడ్స్: చేపలు (ముఖ్యంగా సాల్మన్, ట్యునా వెరైటీ), జీడిపప్పు, బాదాం పప్పు.

సల్ఫర్: కీర దోసకాయ.

విటమిన్ ఎ: క్యారెట్స్, కర్బూజా, చిలగడదుంప, సోయా పాలు, టోఫు, గుడ్లు, నాన్ ఫ్యాట్ మిల్క్...

విటమిన్ సి: కమలా, బత్తాయి, నిమ్మకాయ, బీట్ రూట్, టమాటా, ఎర్ర క్యాప్సికమ్, రేగుపళ్లు, స్ట్రా బెర్రీస్, ఆలివ్‌నూనె, నువ్వుల నూనె, ఆకు కూరలు, నువ్వులు, బాదం పప్పు.

జింక్: మష్రూమ్స్ (పుట్ట గొడుగులు), సీ ఫుడ్, సోయా బీన్స్.

అమినో యాసిడ్స్: దానిమ్మ, పైనాపిల్ , ఆరెంజ్, ఆపిల్, ద్రాక్ష, పుదీనా, పాలకూర, క్యాబేజ్ , పాలు, గుడ్లు, పుచ్చకాయ, పప్పుదినుసులు...

యాంటిఆక్సిడెంట్స్: కిస్‌మిస్, టమాటా, వెల్లుల్లి, ద్రాక్షా, పప్పుదినుసులు, సోయా, గ్రీన్ టీ, పాలకూర...

CoQ10 : ఆపిల్ తొక్కులో ఇది పుష్కలంగా దొరుకుతుంది. రోజుకోయాపిల్ తింటే డాక్టర్ అవసరం లేకపోవటంతో పాటు ముడతలు కూడా దరిచేరవు.

కెరటిన్: జెలటిన్‌తో తయారు చేసిన జెల్లో, అరటి పళ్లు, ఉల్లిపాయ, కాలిఫ్లవర్, చిలకడదుంప, కొవ్వు లేని కోడి, వేట మాంసం.

నీరు: రోజు క నీసం 6-8 గ్లాసుల నీళ్లు తాగటం అన్నది స్వేదగ్రంథుల నుంచి విషపదార్థాలను బయటికి విసర్జించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

దీని బట్టి అర్థం అయ్యేదేంటంటే గాఢమైన రంగులలో లభ్యమయ్యే కాయగూరలు, పళ్ళు... మన శరీరానికి, చర్మానికి ఎంతోమంచివి. ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా మీ సొంతం చేస్తాయి. నిగనిగలాడే చర్మంతో పాటు కొలెస్ట్రాల్ నియంత్రణ, క్యాన్సర్ నివారణకు కూడ పై చెప్పిన ఆహారా పదార్థాలు ఉపయోగపడతాయి.

ఈ సారి సూపర్ మార్కెట్లో రంగురంగుల పళ్లు, కాయగూరలతోటి మీ సంచి నింపండి. అందాన్ని, ఆరోగ్యాన్ని ఇంటికి తెచ్చుకోండి.