పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు..? బహిష్టు కావడం లేదు.

  • PDF
  • Print
  • E-mail
నా వయసు 18. ఐదేళ్ల క్రితం పెద్దమనిషినయ్యాను. పీరియడ్స్ సక్రమంగా రావటం లేదు. ఇంగ్లీషుమందులు వాడాను. తాత్కాలిక ప్రయోజనమే తప్ప ఫలితం కనబడలేదు. స్కానింగ్ చేస్తే ఏదో చిన్న తేడా ఉందన్నారు. ప్రస్తుతం మందులేవీ వాడటం లేదు. నాలుగు నెలలనుండి బహిష్టు కావడం లేదు. దానికి సంబంధించిన చిరాకులు ఏమీ లేకపోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. కొంతకాలానికి అదే సర్దుకుపోతుందా? లేక ఇది ప్రమాదకరమా? నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు.

రజస్వల అయిన తర్వాత నెలసరి సక్రమ మార్గంలోకి రావటానికి ఒక్కొక్కప్పుడు కొన్ని నెలల వ్యవధి పడుతుంది. కాని సంవత్సరాలు తరబడి బహిష్టులు కాకపోవటం నార్మల్ కాదని గుర్తుంచుకోండి. మీరు స్కానింగ్ రిపోర్ట్ సక్రమంగా వివరించలేదు. సాధారణంగా అండాశయం చుట్టూ నీటిబుడగలు రావటం వలన మీరు చెప్పిన సమస్య ఉండవచ్చు. దీన్నే పీసీఓడీ అంటారు. దీనికి సంబంధించి ఆయుర్వేదిక్ మందులు ఈ కింద రాస్తున్నాను. అవి ఓ మూడునెలలపాటు క్రమం తప్పకుండా వాడి పరిస్థితిని సమీక్షించుకోండి. అంతే కాని, పీరియడ్స్ రాక పోవటం వల్ల హ్యాపీగా ఉందనుకోవటం చాలా అజ్ఞానం. దీనివల్ల అండం విడుదలకు సంబంధించిన శాశ్వత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కాంచనార గుగ్గులు ఉదయం 1, రాత్రి 1

సప్తవింశతి గుగ్గులు ఉదయం 1, రాత్రి 1

భంగ్‌శివ్ మాత్రలు ఉదయం 1, రాత్రి 1

అశోకారిష్ట ద్రావకం: 3 చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి రోజూ రెండుపూటలా తాగాలి.

మీరొకసారి జనరల్ చెకప్ చేయించుకోండి. రక్త, మల, మూత్ర పరీక్షలతోపాటు షుగర్ కూడా చెక్‌చేయించుకోండి. ‘థైరాయిడ్’ పరీక్షలు కూడా చేయించుకోండి. వాటిల్లో ఏమైనా తేడాలుంటే వాటికి కూడా చికిత్స అవసరం. మీ పొడవుకి తగ్గట్టుగా బరువు ఉండేట్టు చూసుకోవాలి.

ఆహారం: బయటి తిళ్లు తినవద్దు. ఉప్పు, కారం బాగా తక్కువ తినండి. రోజూ ఒక చెంచా స్వచ్ఛమైన ఆవునెయ్యిని సేవించండి.

విహారం: తేలికపాటి వ్యాయామం, ప్రాణాయామం ప్రతిరోజూ పాటించండి. నియమిత వేళల్లో ఆహారం, నిద్ర ఉండేట్టు చూసుకోండి.
 

Health - ఆరోగ్యం

Districts