పర్వత శిఖరాలపై అనగానే ఊటి, సిమ్లా, ఎవరెస్ట్ మున్నగు ఎతె్తైన ప్రదేశాలు గుర్తుకు వస్తాయి. ఈ ప్రదేశాలు సముద్ర మట్టం కన్నా ఎత్తుగా ఉండటం వల్ల చాలా చల్లగా ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఇవి విహార యాత్రకు అనువుగా ఉంటాయి. అందుకే అందరికీ ఈ ప్రదేశాలు అంటే చాలా ఇష్టం. అయితే ఆ ప్రదేశాలలో వండుకొని తినాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే సముద్రమట్టం కన్నా ఎత్తుగా ఉన్న ప్రదేశాలలో వాతావరణ పీడనం తక్కువగా ఉంటుంది.
వాతావరణ పీడనం తగ్గినప్పుడు నీరు మరిగే ఉష్టోగ్రత కూడా తగ్గుతుంది. సాధారణ పీడనం వద్ద నీరు మరుగుస్థానం 100 డిగ్రీల సెంటీగ్రేడ్. అదే ఎవరెస్ట్ వంటి పర్వత శిఖరాలపై నీరు మరుగుస్ధానం కేవలం 70 డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉంటుంది. అందువల్ల ఈ ఎతె్తైన పర్వత ప్రాంతాలపై గుడ్డు, అన్నం, పప్పు తదితర పదార్థాలు ఉడకాలంటే కనీసం 100 డిగ్రీల సెంటీగ్రేడ్ కావాలి. కానీ నీరు ఆ శిఖరాలపై తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరిగినప్పటికి పదార్థం ఉడకదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఆ ప్రాంత ప్రజలు సాధారణ వంట పాత్రలతో కాక ప్రెషర్ కుక్కర్‌ను తప్పని సరిగా వినియోగించాలి. ప్రెషర్ కుక్కర్ వాడినప్పుడు లోపల పీడనం పెరిగి నీరు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది. దీని వలన పదార్థాలు కూడా తేలికగా ఉడుకుతాయి.


