
19వ శతాబ్దంలో ముస్లింలు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మొఘల్ సామ్రాజ్యం పతనం తర్వాత వారు నిరాశ చెందారు. బ్రిటిష్ ప్రభుత్వం 1857 తిరుగుబాటును అణచి వేసిన తర్వాత ఆ తిరుగు బాటుకు ముస్లింలే కారణం అనే భావనతో ముస్లిం వ్యతిరేక విధానాల్ని అవలం బించింది. దాంతో ముస్లింలలో బ్రిటిష్ వారి పట్ల తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది, వారు పాశ్చాత్య విద్యను వ్యతిరేకించారు. అయితే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చేసిన కృషి వలన వారిలో చైతన్యం పెరిగింది. అలీఘర్ ఉద్యమ స్థాపకుడే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆయన 1876లో మహ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించాడు. హైదరాబాద్ ప్రధానిమంత్రి సాలార్‌జంగ్ ప్రోత్సాహంతో దీనిని ముస్లింల కేంద్ర విద్యాసంస్థగా రూపొందించారు.
మహ్మదీయుల్లో రాజకీయ చైతన్యం పెంచటం, ఆధునిక విద్యను ప్రచారం చేయటం అలీఘర్ ఉద్యమ ముఖ్య ఆశయాలు. బ్రిటిష్ అధికారులు ఈ ఉద్యమాన్ని సమర్థించారు. దీని వలన దేశంలోని ముస్లిం మధ్య సమైఖ్యత పెరిగింది.
ఇస్లాం మతం పట్ల విధేయత తగ్గకుండా పాశ్చాత్య విద్యను ప్రచారం చేయటం ఈ ఉద్యమం లక్ష్యం. ఈ ఉద్యమం బహు భార్యత్వాన్ని, ఘోషా పద్ధతిని ఖండించింది. స్ర్తీ విద్యను ప్రోత్సహించింది. ఉద్యమాన్ని ప్రారంభించిన సర్ సయ్యద్ అహ్మద్ భారతదేశంలోని హిందువులు, ముస్లింలు ఒకటే అని నమ్మారు. పరమతసహనం మంచిదని ప్రచారం చేశాడు. మత ఘర్షణలు వ్యతిరేకించాడు. అహ్మద్ ఖాన్ ఉదార వాది, అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అంగీకరిస్తే అధికారం హిందువులకే లభిస్తుందని భావించాడు. దాంతో మతతత్వ వాదిగా మారాడు


