పెనుగాలి, దానితో పాటు కుంభవృష్టి... ఒకచోట నుంచి మరో చోటికి వేగంగా కదిలిపోతుంటుంది. దీన్నే తుపాన్ అంటాం. భూమధ్యరేఖాప్రాంతాల నుంచి తేమగా ఉండే వేడిగాలి బయలు దేరి, ఉత్తరార్ధగోళ ప్రాంతాల్లో పొడిగా ఉండే గాలిని కలిసినప్పుడు తుపాను మొదలవుతుంది. నిజానికి ఈ రెండు గాలులూ కలగలిసిపోవు. ఈ రెండు రకాల గాలులు ఉద్ధృతంగా కలిసేచోట వేడిగాలి చల్లగాలి కంటే పైకి ఎగసి చల్లబడిపోతుంది.
అప్పుడు గాలిలోని తేమదనం చిక్కబడి మేఘాలు ఏర్పడతాయి. తుపాన్ మధ్య ప్రాంతంలో గాలి ‘పీడనం’ తరిగిపోవడం ఆరంభిస్తుంది. అప్పుడు ‘అల్ప పీడనం’ ఆ ప్రాంతం చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది. అదే ఉత్తరార్ధగోళ ప్రాంతంలోనైతే గాలి ‘అపసవ్య’ దిశలో వీస్తుంది. అంటే వేడిగాలి ఉత్తరం వైపున, చల్లని చలిగాలి దక్షిణం వైపున సాగి పశ్చిమ దిశవైపు తిరుగుతుంది. దీన్నే ‘అల్ప పీడనం’ అంటారు. ఈ ‘అల్పపీడన’ ప్రాంతాన్నే మరో మాటలో తుపాన్ అంటాం.


