రౌలత్ చట్టం - Rowlatt rule

  • PDF
  • Print
  • E-mail
జాతీయోద్యమాన్ని అదుపు చేయటానికి బ్రిటిష్ వారు తీసుకొచ్చిన చట్టాల్లో రౌలత్ చట్టం ఒకటి. మొదటి ప్రపంచ యుద్ధం తరవాత ఈ చట్టం అమలులోకి వచ్చింది. ప్రపంచ యుద్ధం సాగినంత కాలం ప్రభుత్వం, విప్లవ సంఘటనల్ని భారత రక్షణ చట్టం (Defence of Indian rules) నిబంధనలను అనుసరించి విచారణ జరిపి, చర్యలు తీసుకుంది. యుద్ధం ముగిసేటప్పటికి ఈ చట్టానికి కూడా కాలం చెల్లింది. విప్లవోద్యమాన్ని అదుపుచేయటానికి, ప్రభుత్వం ప్రత్యేక శాసనాలను ఆమోదించింది. స్వేచ్ఛకు బదులు ప్రభుత్వం కూడా అణచివేత విధానాన్ని అనుసరించింది. ప్రభుత్వం 1918లో న్యాయమూర్తి రౌలత్ అధ్యక్షతన కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ బిల్లులను రూపొందించారు. అందువల్ల వీటిని రౌలత్ చట్టాలు అంటారు. 1919 ఫిబ్రవరిలో రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. వీటిని దేశప్రజలు నల్లచట్టాలు అని విమర్శించారు. రాజకీయ భిన్నాభిప్రాయాలను విస్మరించి, భారతీయులందరూ ముక్తకంఠంతో ఈ చట్టాలను గ ర్హించారు.

భారతీయ సభ్యులందరూ వ్యతిరేకించినా వాటిని బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించింది. వీటి వల్ల ప్రభుత్వానికి, విస్తృతాధికారాలు లభించాయి. ఎవరినైనా దేశద్రోహ చర్యలకు పాల్పడ్డారన్న అనుమానంపై విచారణ జరపకుండా నిర్బంధించవచ్చు. హెబియస్ కార్ఫస్ చట్టాన్ని అమలు పరచడాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. పత్రికల నోరు నొక్కేశారు. దేశంలో పెరుగుతున్న రాజకీయ అశాంతి దృష్ట్యా, ఆనాటి బ్రిటిష్ ఈ విధమైన శాసనాలను ఆమోదించింది. 1919 ఏప్రిల్‌నెలలో జనరల్ డయ్యర్ జలియన్ వాలాబాగ్‌లో విచక్షణారహితంగా జరిపించిన కాల్పులకు మూలం ఈ చట్టాలే.