ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనం - East India Company

  • PDF
  • Print
  • E-mail

ఈస్ట్ ఇండియా కంపెనీ మనదేశంలో ప్లాసీ యుద్ధం వరకు కేవలం వర్తక సంఘంగా మాత్రమే కొనసాగింది. ఇంగ్లండ్‌లో తయారయ్యే వస్తువులను, ఖరీదైన లోహాలను తెచ్చి మనదేశంలో అమ్మి ఇక్కడ దొరికే విలువైన వస్తువులను ఇంగ్లండ్‌కు తీసుకు వెళ్లేది. వాటిని ఇంగ్లండ్‌తోపాటు యూరప్ దేశాల్లో అధిక ధరలకు అమ్ముకునేది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వస్తువుల తయారీని ప్రోత్సహించింది. కాని బ్రిటిష్ ఉత్పత్తిదారులు దానిని వ్యతిరేకించారు. భారతదేశంలో తయారైన వస్తువులకు ఇంగ్లండ్‌లో గిరాకీ పెరగడం వారికి కన్నుకుట్టింది. బ్రిటిష్ పార్లమెంటులో భారతదేశ వస్తువుల దిగుమతులను అరికడుతూ అనేక చట్టాలు ప్రవేశపెట్టినప్పటికీ 18వ శతాబ్ది మధ్య భాగం వరకు భారతదేశ ఉత్పత్తులకు ఇంగ్లండ్‌లో ఎక్కువ ప్రచారం లభించింది.

బ్రిటిష్ కంపెనీ మనదేశంలో క్రమంగా రాజ్యాక్రమణ మీద ఆసక్తి చూపి తర్వాత రాజకీయ అధికార విస్తరణకు పూనుకోవటంతో వారి వ్యాపారంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. భారతదేశంలోని ఉత్పత్తిదారులు తమ సరుకులను బ్రిటిష్ వర్తకులకే అమ్మాలని కంపెనీ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. కంపెనీ ఉద్యోగులు నేత పనివారికి కొంత మొత్తాన్ని ముందుగానే అప్పులుగా ఇచ్చి వారిని పరోక్షంగా బంధించారు. తన రాజకీయ అధికారాన్ని ఉపయోగించి, పోటీ వ్యాపారులను తొలగించగలిగింది. ఈ చర్యల వల్ల వస్తు ఉత్పత్తిలో అభివృద్ధి సాధించకపోగా, దేశీయ ఆదాయం, ఆర్థిక ప్రగతి కృంగిపోయాయి.

18వ శతాబ్దపు మధ్యభాగంలో ఇంగ్లండ్‌లో సంభవించిన పారిశ్రామిక విప్లవం, కొత్త రకమైన ఉత్పత్తిదారుల విజృంభణకు దారి తీసింది. భారతదేశంలోని వ్యాపారంపై కంపెనీ గుత్తాధిపత్యం వారికి నచ్చలేదు.1813లో చార్టర్ చట్టం అప్పటి వరకు భారత్ వ్యాపారంపై ఆ కంపెనీకి ఉన్న గుత్తాధికారానికి ముగింపు పలికింది. భారతదేశంలో వ్యాపారం చేయటానికి బ్రిటిష్ పౌరులకు అవకాశం దొరికింది. భారతదేశం ఇంగ్లండ్ అధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి భారత దేశాన్ని ఇంగ్లండ్‌కు ఆర్థికవలస దేశంగా పరిగణించారు. భారతదేశ ఆర్థిక విధానం బ్రిటిష్ వారి అవసరాలకు అనుగుణంగా మార్చబడింది. ఈ కారణంగా దేశంలోని భారీ పరిశ్రమలే కాక, చేతిపనులు, గ్రామీణ పరిశ్రమలు కూడా బాగా దెబ్బతిన్నాయి.