భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్న మార్గంలోనే ఒక అంగారక శిల కూడా తిరుగుతున్నదని ఖగోళ పరిశోధకులు ఈ మధ్య గమనించారు. ఆస్టరాయిడ్స్ అనే ఈ రకం శిలలు సూర్యునికి, గ్రహాలకు మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తిని వాడుకుంటూ వాటితో బాటే తిరుగుతూ ఉంటాయి. ఈ రకం శిలలను నెఫ్ట్యూన్, గురు, అంగారక గ్రహాల కక్ష్యలలో ఇంతకు ముందే గమనించారు. ప్రస్తుతం భూమికి తోడుగా తిరుగుతున్న శిల ఒకటి కనిపించిందన్నమాట! కెనడాలోని అతిబాస్కో యూనివర్శిటీ పరిశోధకులు మార్టిన్ కానర్స్ నాయకత్వంలో గత కొన్ని నెలలుగా ఈ విషయం గురించి పరిశోధిస్తున్నారు. భూమితో బాటు, అంగారకశిల తిరుగుతున్నదన్న అనుమానం ముందు కానర్స్‌కు కలిగింది. అది ఒక వేళ భూమి వైపు వస్తున్నదయితే దాన్ని రాత్రిపూట గమనించలేమంటారు కానర్స్.
జూపిటర్ గ్రహంతో బాటు తిరుగుతూ ఉండే శిలలను చూడాలంటే కష్టం లేదు. అవి మనకు రాత్రిగా ఉన్న సమయంలో కూడా కనిపిస్తాయి. మన భూమితో బాటు తిరిగేవి మాత్రం మరి సూర్యునికి, కొంత దగ్గరగా ఉన్నాయి. కనుక అవి ఉదయం, సాయంత్రం, సుమారు ఒక గంట మాత్రమే కనబడతాయి. ఆ కొద్ది సమయంలోనే వాటిని గమనించగలుగుతాము అంటూ పరిశోధకులు వివరించారు. ఇంత కాలంగా భూమితోపాటు తిరుగుతున్న అంగారక శిలను గుర్తించలేక పోవడానికి ఇదొక్కటే కారణం! నాసావారు 2009లో ఇన్‌ఫ్రారెడ్ తరంగాలను గుర్తించే వైడ్ ఫీల్డ్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దాని సాయంతో ఈరకం అంతరిక్ష పరిశీలనల తీరు మారిపోయింది. కనుక అంగారక శిలల గురించి సులభంగా తెలిసి పోయింది. మొత్తం లక్ష యాభయివేల శిలలు కనిపించాయి. వాటిలో 500 భూమికి దగ్గరగా ఉన్నాయి. అందులో 2010 టికె7 అనేది ఒక మార్గంలో భూమి తిరుగుతున్న కక్ష్యలోనే ఉన్నట్లు అనుమానం కలిగింది. ఇక భూమి మీది టెలిస్కోపులతో దాన్ని గమనించి, అది నిజంగానే భూమితోపాటు తిరుగుతున్నదని నిర్ణయించారు.
ఈ విషయం నేచర్ పత్రికలో ప్రకటించారు. ఈ శిల గురించి ప్రస్తుతం ఎక్కువ వివరాలు తెలియవు. అది చాలా చిన్నదని మాత్రం తెలుసు.


