ప్రపంచ జనాభా 2011 సంవత్సరంలోనే ఏడు బిలియనులు దాటుతుందని డెమొగ్రఫీ పరిశోధకులు లెక్క తేల్చారు. 1999లో జనాభా కేవలం 6 బిలియనులు ఉంది. ఇప్పటి నుంచి 2050 వరకు మరో 2.3 బిలియనులు సంఖ్య పెరుగుతుందని కూడా అంటున్నారు. నిజానికి 1950లో మొత్తం ప్రపంచంలో జనాభా రెండున్నర బిలియనుల ప్రాంతంలోనే ఉండేది. ఐక్యరాజ్య సమితిలోని ఆర్థిక, సామాజిక శాఖలో జనాభాను గమనించే విభాగం వారు ఈ లెక్కలను ఈ మధ్య ప్రకటించారు. పరిస్థితులు ఇదే రకంగా కొనసాగితే 2100 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 10.1 బిలియనులకు చేరుతుంది అంటున్నారు.
సైన్స్ వార పత్రికలో జనాభా నిపుణులు డేవిడ్ బ్లూమ్ ఒక కొత్త పత్రాన్ని వెలువరించారు. జనాభా అనుకోనిరకంగా పెరుగుతున్నదని ఆయన తమ సమీక్షలో రాశారు. రానున్న 40 సంవత్సరాలలో జనాభా 2.3 బిలియనులు పెరుగుతుంది. కానీ అందులో 97 శాతం, బడుగు దేశాలలోనే పెరుగుతుందని, అది గమనించవలసిన విషయం అని ఆయన హెచ్చరిస్తున్నారు. అందులోనూ 49 శాతం పెరుగుదల ఒక్క ఆఫ్రికాలోనే ఉంటుందని కూడా లెక్క తేలింది. సంపన్న దేశాలలో జనాభా స్థాయి, స్థిరంగా కొనసాగుతుంది. కానీ అక్కడ సగటు వయసు మాత్రం పెరుగుతూ పోతుంది. అంటే వయసుపై బడిన వారి సంఖ్య ఎక్కువవుతుందని అర్థం. పని చేయగలిగిన వయసువారు తక్కువవుతారు. వారు ఊరికే ఉండే పెద్దలను పోషించవలసి ఉంటుంది. చూడడానికి బీద, ధనిక దేశాల సమస్యలు వేరు వేరుగా కనబడతాయి. అయినా జనాభాకు సంబంధించిన సమస్యల ప్రభావం మాత్రం ప్రపంచం అంతటా ఉంటుంది అంటారు విశే్లషకులు.
మొదట్లో ప్రపంచ జనానా చాలా నెమ్మదిగా పెరిగింది. 1800 సంవత్సరానికి మాత్రమే అది వందకోట్లకు చేరింది. కానీ గడిచిన 50 సంవత్సరాలలో జనాభా మూడు బిలియనుల నుండి ఏడుకు పెరిగింది. 2011 సంవత్సరంలో సుమారు పదమూడున్నర కోట్ల జననాలు, సుమారు ఎనిమిది లక్షల మరణాలు ఉంటాయని లెక్క తేల్చారు. అంటే సుమారు 80 మిలియనులు అంటే 8 కోట్ల మంది పెరుగుదల! ఈ లెక్కలను ప్రభావితం చేయగల ఇతర అంశాలు కూడా ఉన్నాయి అంటారు పరిశోధకులు.


