రిచర్డ్ స్లావిన్ 1950లో చికాగోలో, ఓ యూదుల కుటుంబంలో జన్మించాడు. అతడు అంతర్ముఖుడు. అందరు పిల్లల్లా ఆలోచించేవాడు కాదు. ఊహ తెలిసిన నాటి నుండీ జీవితానికి ఏదో కొత్త అర్థాన్ని వెతుకుతూ ఉంటాడు. జాతి మత విభేదాలు, స్వార్థం, అసూయాద్వేషాలు వంటివి రిచర్డ్ ఆలోచనల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఎప్పుడూ ఏదో చింతన. ప్రతిక్షణం తనను తాను శోధించుకుంటూ ఉంటాడు. తనకే తెలియని ఓ జీవనసత్యం కోసం అనుక్షణం అన్వేషిస్తూ ఉంటాడు. దానిలో భాగంగానే పందొమ్మిదేళ్ల వయసులో యూరప్ పర్యటన ప్రారంభిస్తాడు. తూర్పు, మధ్య ఆసియాలు కూడా పర్యటించి, చివరికి భారతదేశం చేరుకుంటాడు. అప్పుడే అతనికి తాను వెతుకుతున్న పరమార్థం దొరుకుతుంది. ఎంతోకాలంగా తన మనసును వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. రిచర్డ్ స్లావిన్ కాస్తా రాధానాథ్‌స్వామిగా మారతాడు.
ఈ పయనంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలు సామాన్యమైనవి కావు. అవన్నీ ఎంతో చక్కగా వివరించారు స్వామి. ముఖ్యంగా ఆయన రచనలో నిజాయితీ ఉంది. తన విజయాలనే కాదు, వైఫల్యాలను, తనలోని మైనస్ పాయింట్లను కూడా ఎక్కడా దాచిపెట్టకుండా, ప్రతి చిన్న విషయాన్నీ స్పష్టంగా, సవివరంగా తెలిపారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరాలనే ఆయన పట్టుదల అపూర్వం. దేవుడి పట్ల ఆయనకున్న విశ్వాసం అపారం.
ఆయన చేసిన సాహసాలు చదువుతుంటే, మనం పుస్తకం చదువుతున్నామన్న సంగతే మర్చిపోతాం. ఆయనతో పాటే మనమూ ఉన్నాం, అవన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నాం అన్న అనుభూతికి లోనవుతాం. అంతగా ఆకట్టుకుంటుంది ఆయన రచనా విధానం. ఇక్కడ యుగళ కిశోర్‌దాస్‌ని మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే అనువాదమని ఎక్కడా అనిపించనంత అందంగా ‘ద జర్నీ హోమ్’ని తెలుగు చేశారాయన.
ఈ మధ్య నేను ఆత్మకథలను చాలా ఆసక్తిగా చదువుతున్నాను. దానిలో భాగంగానే ‘అమ్మ ఒడిలోకి పయనం’ చదివాను. చాలా ఆత్మకథలు చదివాను గానీ ఇంతగా నన్ను ఉత్తేజితుణ్ని చేసింది మరొకటి లేదు. కామ క్రోధ మద మాత్సర్యాలను విడనాడి, ద్వైత దృష్టిని వదిలిపెట్టి, అన్నీ ఏకమనే ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటే మోక్షం లభించినట్టే అంటారు. ఆ మోక్షాన్ని సాధించడానికి చేసే పయనంలో ఈ రచన ఎంతో ఉపయోగపడుతుంది. మనల్ని ఆధ్యాత్మిక లోకంలో లోతుగా పాతుకుపోయేలా చేస్తుంది.


